*“అతి దాహం” సమస్య వెంటనే తీరుతుంది..! ఆ చిట్కాలు ఏమిటంటే..?*
మధుమేహం ఉన్నవారికి సహజంగా విపరీతమైన ఆకలితోపాటు దాహం కూడా అవుతూ ఉంటుంది. ఇవి వారిలో సహజంగా కనిపించే లక్షణాలే. అయితే మధుమేహం లేని వారిలో కూడా ఒక్కోసారి విపరీతమైన దాహం అనే లక్షణం కనిపిస్తూ ఉంటుంది. వారికి డయాబెటిస్ ఉండకున్నా ముఖ్యంగా వేసవిలో తీవ్రమైన దాహానికి లోనవుతుంటారు. ఎంత నీరు తాగినా వారు సంతృప్తి చెందరు. చల్లని నీరు తాగితేనే కొంత తృఫ్తి చెందుతారు. అయితే శరీరంలో ఎక్కువ మొత్తంలో నీరు వెళ్లిపోవడం మూలంగానే ఇలా జరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. మరి ఈ సమస్యను తగ్గించుకోలేమా..? అంటే తగ్గించుకోవచ్చు..! అందుకు కింద ఇచ్చిన సూచనలు పాటించాలి. అవేమిటంటే…
1. ఒక టీస్పూన్ మంచి గంధాన్ని, రెండు టీస్పూన్ల ఉసిరి రసాన్నీ, రెండు టీస్పూన్ల తేనె కలిపి తాగిస్తే దాహంతో పాటు వాంతులు కూడా తగ్గుతాయి.
2. గ్లాసు చల్లని నీటిలో నాలుగు చెంచాల పంచదార, ఒక నిమ్మకాయను పిండి తీసిన రసం కలిపి తాగితే దాహం తగ్గుతుంది.
3. మేడి పండ్ల రసంలో చక్కెర కలిపి తాగితే అతిదాహం తగ్గుతుంది.
4. సుగంధి పాల కషాయంలో సమంగా చక్కెర కలిపి తేనె పాకంగా వండిన దానికి సగం నీరు కలిపి తాగితే వేసవి తాపం, దాహం తగ్గిపోతాయి.
5. వేసవి ఎండలో అతిగా తిరగడం వల్ల ఏర్పడిన అతి దాహంతో బాధపడే వారికి వరి బియ్యం వండి వార్చిన గంజిలో తెలకపిండిని మెత్తగా నూరి శరీరానికి రాస్తే దాహం అతి త్వరగా తగ్గిపోతుంది.
6. దానిమ్మ పండ్ల రసానికి సమంగా చక్కెర కలిపి తేనె పాకంగా వండి రెండు టీ స్పూన్ల చొప్పున రోజుకి మూడుసార్లు తాగితే దాహం తగ్గుతుంది.
7. ధనియాల కషాయంలో చక్కెర, తేనె కలిపి తాగితే దాహం తగ్గుతుంది.
8. వేసవి కాలం దాహం అనిపించినపుడు గ్లాసు చల్లని నీటిలో అర చెంచాడు ఉప్పు కలిపి తాగుతుంటే త్వరగా దాహం తగ్గుతుంది.
9. పెరుగు అన్నంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు కలిపి తింటే త్వరగా దాహం తగ్గి వడదెబ్బ నుంచి కోలుకుంటారు.
10. వేసవిలో మిరియాలు, అల్లం, నిమ్మరసం కలిపిన చెరుకు రసం తాగితే త్వరగా దాహాన్ని తగ్గిస్తుంది.
11. 200 గ్రాముల నీటిలో 50 గ్రాముల బెల్లం కలిపి చేసిన పాకంలో నిమ్మరసం, కొద్దిగా మిరియాల చూర్ణం కలిపి తాగితే దాహం వెంటనే తగ్గుతుంది.
12. పలుచని మజ్జిగలో కరివేపాకు, నిమ్మరసం, ఉప్పు కలిపి తాగితే దాహాన్ని వెంటనే అదుపు చేస్తుంది.
Comments
Post a Comment